హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవోను పోలీసులు మంగళవారంనాడు రాత్రి 9.45  గంటల వరకు విచారించారు. ఆయన అజ్ఞాతాన్ని వీడి మంగళవారంనాడు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సాయంత్రం 4.30 గంటలకు ఆయన సైబరాబాద్ పోలీసుల ముందుకు వచ్చారు. 

ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9.45 గంటల దాకా రవిప్రకాశ్‌ను ప్రశ్నించింది. మళ్లీ బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

రవిప్రకాశ్‌ విచారణకుసహకరిస్తున్నారని ఏసీపీ తెలిపారు. నటుడు శివాజీ గురించి అడిగితే, ఆయనకు కూడా సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇచ్చామని, కోర్టు అనుమతితో చర్యలు తీసుకుంటామని అన్నారు.

టీవీ-9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుగోలు చేశారని, వారికి అడ్డు వస్తానని భావించి తనపై దొంగ కేసులు బనాయించారని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అన్నారు. మంగళవారం పోలీసుల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు మీటింగ్‌ పెట్టుకొని తనను అక్రమంగా టీవీ-9 నుంచి బయటకు పంపించారని, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇది మాఫియాకు.. మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధమని, ఇందులో జర్నలిజమే గెలుస్తుందని  ఆయన అన్నారు.