హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు రెండో రోజు బుధవారం 11 గంటల పాటు విచారించారు. విచారణలో పోలీసులు వేసిన ప్రశ్నలకు ఆయన పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

రవిప్రకాష్ ను ఉదయం 1130 నుంచి రాత్రి 10:45 వరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆయన గందరగోళ పరిచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. గురువారం నాడు కూడా విచారణకు రావాలని ఆదేశించి ఆయనను ఇంటికి పంపించారు.

మంగళవారం సాయంత్రం విచారణ అధికారులకు సహకరించని ఆయన బుధవారమూ అదే తీరును కొనసాగించినట్లు ఏసీపీ శ్రీనివాస కుమార్‌ చెప్పారు. కుమార్‌ నేతృత్వంలోని బృందమే ఆయనను విచారించింది. అడిగిన విషయాలకు సూటిగా సమాధానం చెప్పకుండా, దాటవేసే ధోరణి కనబర్చారని ఆయన అన్నారు. 

టీవీ-9 కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ సంతకం ఎందుకు ఫోర్జరీ చేశారు?, కొత్తగా తయారు చేసిన డాక్యుమెంట్లను పాత తేదీతో సృష్టించి ఎన్‌సీఎల్‌టీలో ఎలా ఫిర్యాదు చేయంచారనే ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా, 40వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు సృష్టించిన అగ్రిమెంట్‌ విషయం.., సీఈవో హోదాలో టీవీ-9లో నిధుల దుర్వినియోగానికి పాల్పడడం వంటిపై పోలీసులు ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది.

ఏ తప్పూ చేయనప్పుడు పోలీసులు జారీ చేసిన నోటీసులను ఎందుకు లెక్క చేయలేదు? విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది.. అయితే రవిప్రకాష్ తనకు వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా పరస్పర విరుద్ధమైన సమాధానాలిస్తూ గందరగోళానికి గురిచేసినట్లు సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు. 

బుధవారం ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్తే ఆయన 11:30 గంటలకు సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. 12 గంటలకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కుమార్‌ బృందం విచారణ ప్రారంభించి సుదీర్ఘంగా విచారించింది. 

పోలీసులు తెప్పించిన భోజనాన్ని నిరాకరించి తనకు, వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులకు ఇంటి నుంచే భోజనం తెప్పించుకున్నారు. సైబరాబాద్‌ పోలీసుల విచారణ ముగిసిన అనంతరం రవిప్రకాష్ ను బంజారాహిల్స్‌ పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.