అభం..శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే తన కూతురిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గుర్తించి తల్లి అప్రమత్తమవడంతో బాలిక క్షేమంగా బయటపడింది.   

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్ పర్వతనగర్ లో చక్రవర్తి అనే వ్యక్తికి సొంత ఇల్లు వుంది. అందులోని ఓ అంతస్తులో కుటుంబంతో కలిసి నివసముంటున్న అతడు మిగతా పోర్షన్స్ ని అద్దెకిచ్చాడు. అందులో కొన్ని ఫ్యామిలీలు అద్దెకుంటున్నాయి. 

అయితే తన ఇంట్లో అద్దెకుండే ఓ కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై చక్రవర్తి కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను పిలిచాడు. అతడి దురుద్దేశాన్ని బాలిక తల్లి గుర్తించలేక అతడితో పంపించింది. అయితే కొద్ది సేపటి తర్వాత తన కూతురిని తీసుకురావడానికి వెళ్లిన ఆమెకు దారుణం కంటపడింది. ఇంటి యజమాని చక్రవర్తి చిన్నారిని వివస్త్రను చేసి అఘాయిత్యం చేయడానికి సిద్దమయ్యాడు. 

దీంతో వెంటనే ఇంట్లోకి వెళ్లిన తల్లి తన కూతురిని కాపాడింది. అంతేకాకుండా ఇరుగుపొరుగు వారి సాయంతో కామాంధుడికి దేహశుద్ది చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు నిందితుడిపై నిర్భయ, అట్రాసిటి, అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.