నల్గొండ: నల్గొండ జిల్లాలోని అన్ని పార్టీలకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కోదాడ నియోజకవర్గంలోని ఓ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించి అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మోతే మండలం రంగాపురం తండాకు చెందిన వాసులు ఎన్నికలను బహిష్కరించారు. 

తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదని, అందుకే తాము ఓటేయకుండా మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారని తెలియడంతో ఆయా పార్టీల నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు అధికారులు సైతం తండాకు చేరుకుని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎవరు చెప్పినా వినకపోవడంతో ఇక సూర్యాపేట జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. తండా వాసులతో చర్చించి వారిని ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు.