Asianet News TeluguAsianet News Telugu

పోటీకి రాములమ్మ దూరం: టార్గెట్ కేసిఆర్

తొలిసారి శనివారం కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ కు వచ్చిన విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై తన అభిప్రాయాన్ని అధిష్టానంతో చెప్పినట్లు ఆమె తెలిపారు.

Ramulamma will not contest in the elections
Author
Hyderabad, First Published Sep 29, 2018, 8:57 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాములమ్మ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని ఆమె కాంగ్రెసుకు ప్రచార రథసారథిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెసును అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని ఆమె కుండబద్దలు కొట్టారు. దీన్ని బట్టి ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న విజయశాంతిని క్రమంగా కేసిఆర్ దూరం చేస్తూ వచ్చారు.

ఆమెకు పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. దాంతో ఆమె టీఆర్ఎస్ లో ఉండలేక రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. చాలా కాలంగా కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె తాజాగా క్రియాశీలకంగా మారారు. కేసీఆర్ పై తనకు ఉన్న ఆగ్రహాన్ని ఆయనను దెబ్బ తీయాలనే లక్ష్యం దిశగా మళ్లించినట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆమె కాంగ్రెసు తరఫున పెద్ద యెత్తున ప్రచారం చేయడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఆమె మాటల్లో అదే విషయం వ్యక్తమవుతోంది.

తొలిసారి శనివారం కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ కు వచ్చిన విజయశాంతి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై తన అభిప్రాయాన్ని అధిష్టానంతో చెప్పినట్లు ఆమె తెలిపారు. టీడీపితో పొత్తును ఆమె వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చెప్పినట్లు ఆమె తెలిపారు. 

పోటీ చేస్తే ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని, తమ శక్తినంతా ప్రచారంపైనే పెడుతానని, రాష్ట్రమంతా ప్రచారం చేస్తానని, తిరిగి కాంగ్రెసును అధికారంలోకి తెస్తానని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెసు, టీఆర్ఎస్ మధ్య యుద్ధమని అన్నారు. 

ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటే హామీలను అమలు చేయనట్లేనని, ప్రజల వద్దకు వెళ్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. టీఆర్ఎస్ దూకుడు మాటల్లోనే చేతల్లో కాదని, ఆ దూకుడు తగ్గిస్తానని విజయశాంతి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios