హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్‌ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రాంప్రసాద్‌కు  కోగంటి సత్యం  మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని డీసీపీ చెప్పారు. ఆర్థిక వివాదాల నేపథ్యంలో కోగంటి సత్యం బెదిరింపులకు భయపడి రాంప్రసాద్ హైద్రాబాద్ కు 2015లో  షిఫ్ట్ అయ్యాడని ఆయన చెప్పారు.

రాంప్రసాద్‌ను హత్య చేస్తే తనకు రావాల్సిన డబ్బులను వసూలు చేసుకోవచ్చని కోగంటి సత్యం  భావించాడని చెప్పారు.  కిరాయి హంతకులతో  కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్  ఒప్పందం కుదుర్చుకొన్నాడని డీసీపీ వివరించారు.

రాంప్రసాద్ హత్యలో ఆంజనేయ ప్రసాద్, బాజీ , రాముతో పాటు మరో వ్యక్తి ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆయన చెప్పారు. రాంప్రసాద్ కదలికలను కనిపెట్టేందుకు హైద్రాబాద్‌లో ముగ్గురిని  శ్యామ్ నియమించాడని  డీసీపీ చెప్పారు.

రాంప్రసాద్ హత్య జరిగిన సమయంలో  పంజగుట్ట యశోద ఆసుపత్రి వద్ద కోగంటి సత్యం ఉన్నాడని పోలీసులు చెప్పారు. రాంప్రసాద్ మృతి చెందాడని నిర్ధారించుకొన్న తర్వాతే సత్యం అక్కడి నుండి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

శ్యామ్‌కు చెందిన వాటర్ ప్లాంట్‌లోనే ఆయుధాలను తయారు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. రాంప్రసాద్ హత్యలో పాల్గొన్న వారికి గతంలో ఏమైనా నేరచరిత్ర ఉందా అనే కోణంలో కూడ ఆరా తీస్తున్నామన్నారు.

ఈ హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని నమ్మించేందుకు  కోగంటి సత్యం ప్రయత్నించాడని  పోలీసులు చెప్పారు. ఈ విషయంలో  సత్యం ప్లాన్ మేరకు  శ్యామ్ వ్యవహరించాడని  డీసీపీ శ్రీనివాస్ చెప్పారు.

బొలెరో వాహనంలో శ్యామ్ ఆయుధాలను తీసుకొచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. హత్య సమయంలో నిందితులు స్కూటీని కూడ ఉపయోగించారని పోలీసులు తెలిపారు.