రామాయంపేట తల్లీకొడుకుల ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రూ.29 లక్షలతో పాటు బిజినెస్‌లో 50 శాతం షేర్ డిమాండ్ చేయడం వల్లే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
రామాయంపేట (ramayampet) తల్లీకొడుకుల ఆత్మహత్య (son and mother suicide) కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుల ఒత్తిడితోనే తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రూ.29 లక్షలతో పాటు బిజినెస్‌లో 50 శాతం షేర్ డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశారని సంతోష్‌పై కేసు పెట్టి వేధించినట్లు రిపోర్టులో వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్.
నిందితులు పల్లె జితేందర్ గౌడ్ మెదక్ జిల్లాలోని (medak district) రామాయంపేట్ మున్సిపల్ చైర్మన్, సరాఫ్ యాదగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఐరేని పృథ్వీ గౌడ్, తోట కిరణ్, కన్నపురం కృష్ణ గౌడ్, సరాప్ స్వరాజ్‌లను న్యాయమూర్తి ఆదేశాలతో నిజామాబాద్ జైలుకు తరలించారు. విచారణ కోసం కస్టడీకి అనుమతించాలని రేపు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రస్తుత తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ పైన విచారణ కొనసాగుతోందని కామారెడ్డి పోలీసులు పేర్కొన్నారు. సీఐని అరెస్ట్ చేయకపోవడంపై మీడియా ప్రశ్నించగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లుగా వెల్లడించారు.
ఇకపోతే.. రామాయంపేటకు పద్మ, సంతోష్‌లు ఇటీవల కామారెడ్డిలోని లాడ్జ్‌లో రూమ్ తీసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టినట్టుగా డీఎస్పీ వెల్లడించారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, తాము ఆత్మహత్య చేసుకోవడానిక ఏడుగురు కారణమని మృతులు సూసైడ్ నోటులో పేర్కొన్నారు. తాము చనిపోవడానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారని సంతోష్ వీడియోలో చెప్పారు.
‘శ్రీను అనే వ్యక్తితో కలిసి నేను వ్యాపారం చేశాను. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో.. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నాడు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు’ అని సంతోష్ వీడియోలో పేర్కొన్నాడు.
మున్సిపల్ చైర్మన్‌తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గారని.. ఏడాది పాటు తనను వేధించారని చెప్పాడు. తన వ్యాపారం జరగకుండా చేశారని సంతోష్ సెల్పీ వీడియోలో తెలిపాడు. దీంతో తాను అర్థికంగా నష్టపోయానని.. అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నాడు. వీడియోలో తల్లి, కొడుకులు కన్నీరు పెట్టుకుంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ వీడియో కన్నీరు పెట్టించేలా ఉంది.
