ఈయనా మా సీఎం... తూ... అనే స్థాయికి దిగజారావు కదా..: కేసీఆర్ పై ఈటల ఫైర్

రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేధింపులే తమ చావుకు కారణమంటూ తల్లీ కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. 

ramayampet mother and son suicide... eatala rajender fires on cm kcr

రామాయంపేట: అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడితో పాటు మరికొందరి వేధింపులే కారణమంటూ మెదక్ జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్య రాజకీయ దుమారం రేపుతోంది. రామాయంపేట మున్సిపల్  చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని సూసైడ్ కు ముందు తీసుకున్న సెల్పీ వీడియోలో మృతుడు వెల్లడించాడు. దీంతో తల్లీకొడుకు ఆత్మహత్యకు కారణమైన టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

తాజాగా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (eatala rajender), రఘునందన్ రావు (raghunandan rao)తో పాటు వివేక్ వెంకట స్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, తుల ఉమ, ప్రేమెందర్ రెడ్డి తదితర బిజెపి నాయకులు ఆత్మహత్య చేసుకున్న పద్మ, గంగం సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. కట్టుకున్న భార్య, కన్న కొడుకును కోల్పోయి బోరున విలపించిన అంజయ్యను బిజెపి నాయకులు ఓదార్చారు. సంతోష్ తోబుట్టువులు శ్రీధర్, రాణిలను కూడా ఓదార్చారు. 

ఈ సందర్భంగా ఈటల మట్లాడుతూ... ఉద్యమ సమయంలో కేసిఆర్ ప్రవర్తన వేరుగా వుండేదని... సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈయనా మా సీఎం...అంటూ నీచంగా చూస్తున్నారన్నారు. చివరకు తూ అనే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారిపోయారన్నారు. ఒకప్పుడు తెలంగాణ గాంధీ అన్నవారే ఇప్పుడు తెలంగాణ  ద్రోహి అంటున్నారన్నారు.  
 
''అంజయ్య సతీమణి పద్మ, కుమారుడు సంతోష్ వి ఆత్మహాత్యలు కావు... ఈ ప్రభుత్వ హత్యలే. ప్రగతి భవన్లో కూర్చొని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మీరు ఏమన్నా చేసుకోండి... మీపై ఎలాంటి కేసులు ఉండవు అని స్వయంగా సీఎం కెసిఆర్ చెప్పడమే దీనికి కారణం'' అని ఈటల ఆరోపించారు.  

''తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి... ఆర్థిక దిగ్బంధం చేసి లొంగదీసుకుంటున్నారు. డీజీపీ గారు... మీరు ఊర్లో పుట్టి పెరిగినవారు. తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారో మీకు తెలుసు. సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ లో పని చేసారు. అలాంటి మీరు ఐపిసి ప్రకారం పని చేస్తున్నారా? గులాం గిరీ చేస్తున్నారా? మీరు ఎందుకు ప్రజలను కాపాడలేకపోతున్నారు. సీఎం ఉంటాడు పోతాడు... నాయకులు ఉంటారు పోతారు... కానీ పోలీసులు 30, 40 ఏళ్లు విధులు నిర్వహించాలి. ఆత్మను చంపుకొని పని చేస్తే మిమ్ముల్ని చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నా'' అన్నారు. 

''ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్మార్గాల మీద కన్ను వేయాలి... సంఘ విద్రోహ శక్తుల మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, వారి సెల్ ఫోన్ ల మీద నిఘా పెట్టి వేధిస్తున్నారు. సిరిసిల్ల ఇసుక దందాకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకు వస్లే అక్రమార్కులపై కాకుండా ప్రజలపైనే కేసులు పెట్టారు. ఇసుక దందా చేసేవారంతా మీ కులపోల్లు కాబట్టే వారిని వదిలిపెట్టి ప్రజలమీద కేసులు పెట్టిన చరిత్ర మీది'' అని సీఎంపై ఈటల ఆరోపణలు చేసారు. 

''సీఎం కేసీఆర్ వెంటనే  రాజీనామా చేయాలి. డీజీపీ కూడా ఒక్క నిమిషం కూడా ఆ కుర్చీలో కూర్చోవడానికి వేలు లేదు. ఆ కుర్చీ మీకు రాజ్యాంగ బద్దంగా వచ్చింది... అది మర్చిపోవద్దు. డీజీపీకి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండరు.. డీఎస్పీలు మాట్లాడరు... ఎసిపిలు స్పందించరు. ఇంత బానిసలా? ప్రజల డబ్బులు చెల్లిస్తే వాటితో మీకు జీతాలు వస్తున్నాయి. ప్రజలకు జీతగాల్లు అని మర్చిపోకండి'' అని ఈటల హెచ్చరించారు. 

''టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ అరాచకాలు చెప్తే ఒడవదు. ఈ జిల్లా మంత్రి మాది న్యాయబద్ద మైన పాలన అంటారు. మిస్టర్ హరీష్ రావు... నీ గడ్డ మీద నుండి అడుగుతున్నా... హుజూరాబాద్ లో ఖర్చు పెట్టిన రూ.600 కోట్లు నీ ఆస్థి అమ్మి తెచ్చినవా? మీ మామ ఆస్తి అమ్మి తెచ్చినవా? హుజూరాబాద్ ప్రజలు కర్రుకల్చి వాత పెట్టినా బుద్ది రాని పార్టీ మీది. హుజూరాబాద్ గెలుపే తెలంగాణ అంత అదే రిపీట్ అవుతుంది. మిమ్ముల్ని పల్లెల్లో తరిమి తరిమి కొడతారు. పోలీసులు... నీ  కార్యకర్తలు... ఎవరూ కాపడలేరు. కాపాడే ప్రజలను మీరు వేధిస్తున్నారు'' అని ఈటల మండిపడ్డారు. 

''పద్మ, సంతోష్ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి. స్వయంగా సీఐలే పోలీస్ స్టేషన్లో కూర్చొని ప్రజలను వేధిస్తుంటే ఎవరికీ చెప్పుకోవాలి. అలాంటి నీచులు పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి అర్హులు కారు. తల్లీ కొడుకు ఆత్మహత్యకు కారణమైన అందరినీ హత్యానేరం కింద వెంటనే అరెస్ట్ చెయ్యాలి'' అని ఈటల రాజేందర్ డిమాండ్ చేసారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios