Asianet News TeluguAsianet News Telugu

ఆ కేసులో రామచంద్ర భారతికి బెయిల్.. రేపు చంచల్‌గూడ నుంచి విడుదల

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు రామచంద్ర భారతికి ఊరట లభించింది. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఆయనకు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 
 

ramachandra bharathi get bail from fake passport case
Author
First Published Dec 29, 2022, 8:58 PM IST

నకిలీ పాస్‌పోర్ట్ కేసులో జైల్లో వున్న రామచంద్ర భారతికి నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలకానున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతి నిందితుడిగా వున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే నకిలీ పాస్‌పోర్ట్ కేసులో రామచంద్రభారతి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సమర్పించి ఆయన పాస్‌పోర్ట్‌ పొందినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో రామచంద్రభారతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.   

ఇదిలావుండగా... సిట్‌ను రద్దు చేస్తూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేసింది తెలంగాణ హైకోర్ట్. ఈ కేసులో కోర్ట్ నుంచి ఆర్డర్ కాపీ వచ్చింది . ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక విషయాలు ప్రస్తావించింది హైకోర్ట్. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని.. సీఎంకు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని కోర్ట్ వ్యాఖ్యానించింది. 

సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కూడా ఆర్డర్ కాపీలో ప్రస్తావించింది ధర్మాసనం. కోర్ట్ ఆర్డర్‌లో సిట్ ఉనికిని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్ట్‌కి సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ని బహిర్గతం చేశారని.. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్ట్. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసును ప్రస్తావించింది ధర్మాసనం. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపిస్తూ హైకోర్ట్ తీర్పు వెలువరించింది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనాన్ని ప్రసారం చేసింది. 

కాగా.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐతో  విచారణ చేసేందుకు  తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు అనుమతి ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సిట్  అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది  అక్టోబర్  26న  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,  పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని  పోలీసులకు  ఫిర్యాదు  అందింది. ఈ విషయమై  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు  మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసులో  రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios