Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ను టార్గెట్ చేసిన బిజెపి: రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించడానికి ఎప్పటి నుండో పావులు కదుపుతున్న బీజేపీ కరోనా వైరస్ విషయంలో కేసీఆర్ పై విరుచుకుపడుతుంది. ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు అన్నదానికి ఉదాహరణ కేసీఆర్‌ సర్కారేనని రాంమాధవ్ ఎద్దేవా చేసారు. 

ram madhav fires on cm kcr: what's BJP plan in Telangana...?
Author
Hyderabad, First Published Jul 2, 2020, 9:26 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. కేసులు ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్నాయి. రోజుకో 3000 నుంచి నాలుగు వేల మధ్య టెస్టులు నిర్వహిస్తుంటే... వాటిలో దాదాపుగా 1000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి, లేదా నలుగురిలో ఒకరికి కరోనా వైరస్ ఉన్నట్టుగా కనబడుతుంది. 

ఇదే విషయమై తెరాస సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెరాస సర్కార్ కరోనా వైరస్ విషయంలో సరైన చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించడానికి ఎప్పటి నుండో పావులు కదుపుతున్న బీజేపీ ఈ విషయమై కేసీఆర్ పై విరుచుకుపడుతుంది. 

జన్‌సంవాద్‌ ప్రాంతీయ వర్చువల్‌ ర్యాలీలో నిన్న బుధవారం నాడుముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌.. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాపార్టీ నాయకులనుద్దేశించి ప్రసంగిస్తూ..... ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు అన్నదానికి ఉదాహరణ కేసీఆర్‌ సర్కారేనని ఆయన ఎద్దేవా చేసారు. 

దేశం మొత్తం మీద ఉన్న బీజేపీ కార్యకర్తలతో ఈ కరోనా వేళ సమావేశమయ్యేందుకు ఈ వర్చువల్ ర్యాలీలను నిర్వహిస్తోంది బీజేపీ. ఈ జాన్ సంవాద్ ర్యాలీలో పాల్గొనే రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

కరోనా కేసులపై తప్పుడు లెక్కలతో, మసిపూసి మా రేడు కాయ చేసినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందా,  మహా అయితే కేంద్ర బృందాలను మోసం చేయగలరు.. కానీ, కరోనా బారిన పడ్డ రాష్ట్ర ప్రజలను  తెరాస సర్కార్ ఎంతకాలం మోసం చేయగలదు ఆయన విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ గతంలో ముందుకు తీసుకొచ్చిన ఫెడరల్ ఫ్రంట్ పై కూడా రామ్ మాధవ్ వ్యాఖ్యలు చేసారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం గతంలో ప్రయత్నించిన కేసీఆర్‌ ఇప్పుడు ఫ్రంటూ లేకుండా.. టెంటూ లేకుండా.. ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయారు అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సగం సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప, ఏడాది కాలంలో కేసీఆర్ సర్కారు  సాధించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

తెరాస ఏడాది పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇచ్చే ధైర్యముందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు రామ్ మాధవ్. అవినీతికి, అసమర్థతకు మారుపేరుగా తెలంగాణ ప్రభు త్వం మారిందని, చివరకు కరోనాపై పోరాటంలో కూడా ఇవే ప్రధాన అడ్డంకిగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. 

కేంద్రానికి ఆదాయం వచ్చినా రాకున్నా, పన్నుల వాటా కింద తెలంగాణకు సుమారు 20వేల కోట్లు ఇస్తామని కేంద్రం మాట ఇచ్చిందన్నారు. ఇందుకు సిద్ధమేనని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి, అసమర్థతకు మారుపేరుగా మారిందని తెలంగాణ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. 

అమెరికా వంటి దేశాలు కరోనాతో విలవిల్లాడుతున్నా, మనదేశంలో అదుపులో ఉంచగలిగామని, కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల కేసులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

3 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కరోనా పరీక్షలు చేయకున్నా, అంకెలగారడీలు  చేసినప్పటికీ.....  15వేల కేసులు నమోదయ్యాయని, కానీ యూపీలో రోజుకు 20వేల పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో 2 వేలు కూడా చేయట్లేదని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ ఒక్క విషయంలోనూ వదిలిపెట్టకుండా ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. కరోనా విషయంలో యావత్ దేశం తెలంగాణ వైపు వేలెత్తి చూపెడుతున్న వేళ రామ్ మాధవ్ ఈ అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చూడబోతుంటే... బీజేపీ తెలంగాణాలో పాగా వెయ్యాలని బలంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios