హైదరాబాద్‌: తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. నిబంధనలు ప్రకారమే భోగస్ ఓట్లు తొలగించామని తెలిపారు. మంత్రులు కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనవద్దని సూచించారు. కుల సంఘాల సమావేశాలకు వెళ్తే ఎన్నికల ఉల్లంఘనగా పరిగణిస్తామని ప్రకటించారు. 

అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చు లెక్కలోకి వస్తుందని రజత్ కుమార్ తెలిపారు. తొలిరోజు 43 నామినేషన్లు వచ్చాయని, ఇంకా 7 నియోజకవర్గాల నుంచి వివరాలు అందాల్సి ఉందన్నారు. ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు చెప్పారు. 

తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఇప్పటి వరకు రూ.77.62 కోట్ల నగదును సీజ్ చేశామని 4038 మద్యం దుకాణాలు తొలగించినట్లు రజత్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకు 47,234 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా 2251 ఫిర్యాదులు అందాయని వాటిలో 1279 పరిష్కరించామన్నారు. మొత్తం 2, 76, 29610 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. 

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ముగ్గురు నేతలకు నోటీసులు ఇచ్చామని అయితే వారు సమాధానం చెప్పినట్లు తెలిపారు. బోగస్, డబుల్ ఓట్లు లక్ష 60 వేలు ఉన్నాయని, వాటి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు.