ఇప్పటికే చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలతో మండుటెండల నుండి కాస్త ఉపశమనం పొందుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో చల్లటి కబురు చెప్పింది. ఈ రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు.

హైదరాబాద్: మండుటెండలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురియడంతో వాతావరణం చల్లబడింది. మరో రెండ్రోజులపాటు(ఆది, సోమవారం) రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ వర్ష ప్రభావంతో ఎండతతీవ్రత కూడా కాస్త తగ్గి వాతావరణం కూడా చల్లబడనుంది. 

చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రభావంతో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురియనున్నాయని వెల్లడించింది. 

ఉరుములతో కూడిన వర్షాలకు తోడు గంటకు 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లనుండి బయటకు వెళ్లరాదని సూచించారు. గతంలో ఈదురుగాలుల కారణంగా భారీ హోర్డింగ్ లు, ప్లెక్సీలు కూలి రద్దీగా వుండే రోడ్లపై పడిన అనుభవాల దృష్ట్యా అలాంటి ఘటనలు జరక్కుండా అధికారులు కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇక ఈ నెల (ఏప్రిల్) ఆరంభం నుండి తెలంగాణలో వాతావరణం మారి అక్కడక్కడా చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా మధ్యలో ఇలా వర్షాలు కురిసి వాతావరణాన్ని చల్లబర్చి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. తాజాగా మరోసారి వర్షాలు కురిసి ఎండల నుండి రాష్ట్ర ప్రజలకు సాంత్వన కలిగించనున్నాయి. 

ఇదిలావుంటే గత గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్నట్టుండి వర్షాలు ముంచెత్తాయి. చిన్నగా మొదలైన వర్షం కుండపోతగా మారి ఈ మండువేసవిలో ఐటీ నగరాన్ని ముంచెత్తింది. వర్షపునీటితో రోడ్లు, పేవ్‌మెంట్లు మునిగిపోయాయి. కొన్ని చోట్ల వరద నీరు భారీగా నిలిచిపోయింది. కొన్ని వీధుల్లో దాదాపు నడుము లోతు వరకు వరద నీరు చేరడం గమనార్హం. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ), అగ్నిమాపక శాఖలు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేపట్టాయి.