Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో గాలివాన: జూలో చెట్టు కూలి వరంగల్ మహిళ మృతి (వీడియో)

జూలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నిఖత్‌ ఫాతిమాపై భారీ చెట్టు కూలి తీవ్రంగా గాయపడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Rain in Hyderabad: woman dies falling tree at Zoo
Author
Hyderabad, First Published Apr 20, 2019, 8:49 PM IST

హైదరాబాద్: హైదరాబాదు నగరంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నెహ్రూ జూపార్కులో చెట్టు కూలి ఓ మహిళ మరణించింది. వరంగల్‌కు చెందిన నిఖత్‌ ఫాతిమా (60) కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూలాజికల్‌ పార్కు సందర్శనకు వచ్చింది. 

శనివారం సాయంత్రం ఈదురు గాలులకు పెద్ద వర్షం రావడంతో భారీ చెట్టు కూలి నెలకొరిగాయి. జూలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నిఖత్‌ ఫాతిమాపై భారీ చెట్టు కూలి తీవ్రంగా గాయపడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో మరో 10 మందికి స్వల్ప గాయాలకు గురైనట్లు పోలీసులు, జూపార్కు అధికారులు తెలిపారు. 

మహిళ మరణించడంపై, పది గాయపడడంపై హెడ్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌ పీసీసీఎఫ్‌ ప్రశాంత్‌ కుమార్‌ ఝా విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్కు డైరెక్టర్‌ సిదానంద్‌ కుక్రెట్టి, జూ క్యూరేటర్‌ క్షితిజాలు జూలో నెలకొరిగిన చెట్ల ప్రదేశాలను పరిశీలించారు.  

హైదరాబాదులో గాలి వానకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూడా కూలాయి.చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు 47 చెట్లు కూలినట్లు, 18 ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినట్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందాయి. 

జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలు రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలందించాయి. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌, కామినేని ఆస్పత్రి,  హైకోర్టు వెనుక భాగంలో, హుస్సేనిఆలం పీఎస్‌ ముందు, మిశ్రీగంజ్‌ ఆయా హోటల్‌,  శాలిబండ పీఎస్‌ వెనుక, హుస్సేనీఆలం హనుమాన్‌ మందిర్‌ వద్ద,తదితర ప్రాంతాల్లో  చెట్లు నేల కూలినట్లు సమాచారం అందింది. 

పాతబస్తీలోని నూర్‌ఖాన్‌ బజార్‌లో కొత్తగా నిర్మించిన భవనం పిట్టగోడ కూలింది. అంతేకాకుండా చెట్లు కూలడంతో అక్కడున్న మూడు బైక్‌లపై పడ్డాయి. ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ ప్రదేశంలో భారీ చెట్టు కూలిపోయింది.  జోనల్‌ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి, అత్యవసర ఫిర్యాదులపై క్షేత్రస్థాయి బృందాలు తక్షణ సాయమందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ దానకిశోర్‌ సూచించారు. 

"

Follow Us:
Download App:
  • android
  • ios