ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉన్నమాట నిజమేనని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. కానీ తమ ప్రయోజనాలు, రాజకీయాల కోసం హైదరాబాద్ కు ఎప్పుడూ అన్యాయం చేయలేదని...ఈ నగర కీర్తిని మరింత పెంచామన్నారు. హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్, ఎక్స్ ప్రెస్ వే, మెట్రో లు తమ హయాంలో ప్రారంభమైనవేనని రాహుల్ తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ పాలనలో హైదరాబాద్ నగరం అద్వానంగా తయారయ్యిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లు, ఉపాధి పరిస్థితి దుర్భరంగా ఉందని రాహుల్ ఆరోపించారు. 

హైదరాబాద్ నాంపల్లి ఆసిఫ్ నగర్ లో మహాకూటమి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ తో పాటు ఎపి సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ అసలు పేరు టీఆర్ఎస్ఎస్ ( తెలంగాణ రాష్ట్రీయ్ సంఘ్ సమితి)  అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. 

 తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టి మొత్తం అవినితి, అక్రమాలు, కమీషన్లపైనే ఉందని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ చోటా మోదీ కూడా కాదని....కేసీఆర్ అంటే కావో కమీషన్ రావు (కమీషన్లు తినే వ్యక్తి) అని రాహుల్ సెటైర్లు వేశారు. 

ఎన్నికలు వేరే వేరే ప్రాంతాల్లో జరుగుతున్నాయని...అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్  ఓ పక్షంలో ఉంటే ప్రతిపక్షాలన్ని కాంగ్రెస్ పక్షాన ఉన్నాయన్నారు. కానీ ఒక్క తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్, ఎంఐఎంలు బిజెపి పక్షాన ఉన్నాయన్నారు. బిజెపికి సపోర్ట్ చేయడానికి ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయకుండా అస్సాం ఎన్నికల్లో పోటీ చేసిందని రాహుల్ ఆరోపించారు.

ఒకే దేశంలో రెండు విధాల పాలన సాగుతోందని రాహుల్ పేర్కొన్నారు. పేదలకు ఓ రకమైన పాలన, ధనవంతులకు మరో రకమైన పాలన జరుగుతోందన్నారు. దేశంలో జరగుతున్న ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సెమి ఫైనల్ వంటివని రాహుల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి  బి టీమ్ టీఆర్ఎస్,సి టీమ్ ఎంఐఎం లను ఓడించి ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ కోరారు.