హైదరాబాద్: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలను ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొట్టిపారేయలేదు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని మెరుగు పరుచుకుంటుందని ఆయన చెప్పారు. 

మంగళవారంనాడు రాహుల్ గాంధీ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీడీపితో పొత్తు ఉండే అవకాశాలను ఆయన తోసిపుచ్చలేదు. భావసారూప్యం గల పార్టీలతో పొత్తు పెట్టుకునే నిర్ణయాన్ని పిసిసిలు తీసుకుంటాయని, ఆ స్వేచ్ఛను పిసిసిలకు ఇచ్చామని ఆయన చెప్పారు. 

అయితే, పిసిసిల సిఫార్సులను పరిశీలించి అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ పిసిసి పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.  

పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీలో తెలుగు నాయకులకు స్థానం కల్పించకపోవడంపై ప్రశ్నించగా, మార్పులుంటాయని, అదేం కదిలంచడానికి వీలు లేని వ్యవస్థ కాదని అన్నారు. 

కాగా, తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఆయన క్లాసు తీసుకున్నారు. ఐక్యంగా పనిచేస్తే తెలంగాణలో పార్టీ పరిస్థితి మరింత మెరుగవుతుందని వారికి చెప్పారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఎన్నికలను ఐక్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. మంగళవారం సాయంత్రం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు.