కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెట్టనుంది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో సోమవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం కాంగ్రెస్ భారీగా జనసమీకరణ కూడా చేపట్టింది. భారత్ జోడో గర్జన పేరుతో లక్ష మందితో ఈ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.
ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ సోమవారం ఉదయం జుక్కల్ నియోజకవర్గంలోని ఫతాలపూర్ గేటు నుంచి యాత్ర ప్రారంభించారు. షేకాపూర్ వద్ద రాహుల్ గాంధీ లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి సాయంత్రం పాదయాత్రను ప్రారంభించనున్నారు. మేనూరు వద్ద జరిగే భారత్ జోడో గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత మిర్జాపూర్ హనుమాన్ టెంపుల్ వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. అనంతరం రాహుల్ యాత్ర సలాబత్‌పూర్ దగ్గర మహారాష్ట్రలోనికి ప్రవేశించనుంది. అక్కడ రాహుల్‌కు ఘన స్వాగతం పలికేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నారు. ఇక, ఈ రోజు మేనూరు వరకు రాహుల్ యాత్ర 20 కి.మీ మేర సాగనుంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం తీసుకురావడానికి రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పాదయాత్ర పూర్తి చేసుకన్న రాహుల్ గాంధీ.. అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించారు. అయితే దీపావళి పండగ, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారోత్సం సందర్భంగా అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. అక్టోబర్ 27న రాహుల్ పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. నవంబర్ 4వ తేదీన పాదయాత్రలో సాధారణ విరామం తీసుకున్నారు. ఇక, తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల పాటు సాగిన రాహుల్ పాదయాత్ర నేటితో ముగియనుంది.
ఉదయమే పాదయాత్ర ప్రారంభిస్తున్న రాహుల్ గాంధీ.. యాత్ర మార్గంలో తనతో సమస్యలు చెప్పుకునేవారిక అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులు, రైతులే కాకుండా అనేక వర్గాల సమస్యలను రాహుల్ వింటున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్తులపై గురించి స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీతో తమకు పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషమైన స్పందన వస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసానిస్తూ రాహుల్ యాత్ర సాగుతోందని తెలిపారు.
ఈడీ, సీబీఐ దాడులు చేసినా, తన ప్రాణానికి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ వెనకడుగు వేయకుండా పాదయాత్ర చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టలేదని చెప్పారు. దేశ విశాల ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం తనకు దేవుడిచ్చిన వరం అని రేవంత్ పేర్కొన్నారు.
