టీఆర్ఎస్‌తో తమ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఎలాంటి అవగాహన గానీ.. పొత్తు గానీ ఉండదని చెప్పారు.
టీఆర్ఎస్‌తో తమ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఎలాంటి అవగాహన గానీ.. పొత్తు గానీ ఉండదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ నడపవచ్చని.. అందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చని.. యూఎస్, చైనా ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చని అన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ నేడు రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూరులో మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
టీఆర్ఎస్‌తో పొత్తు వద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర నేతల అభిప్రాయం ప్రకారమే ముందుకు వెళతామన్నారు. టీఆర్ఎస్ తో భవిష్యత్ లోనూ ఎలాంటి పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతుందని ఆరోపించారు. అవినీతికి పాల్పడే వారితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ వర్గాల కోసమే ప్రధాని మోడీ పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అస్తవ్యస్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించారు.
భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో విశ్వాసం నింపుతున్నామని చెప్పారు. తమ పార్టీ పూర్తిగా డెమోక్రటిక్ అని.. నియంతృత్వంతో నడిచేది కాదని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు జరిగి.. ప్రజాస్వామ్యయుతంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నది అంతా చూశారని అన్నారు. నియంతృత్వాన్ని నడపకపోవడం తమ పార్టీ డీఎన్‌ఏ అని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో అని తాను ఆశ్చర్యపోతున్నానని అన్నారు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు తమ పార్టీలో ప్రజాస్వామ్యం గురించి అడుగుతారని.. కానీ బీజేపీని అడిగే ధైర్యం చేయరని అన్నారు.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి సన్నద్ధతతో పోరాడుతోందని రాహుల్ గాంధీ చెప్పారు. గుజరాత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా వేవ్ ఉందని అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికలపై పార్టీలో చర్చ కొనసాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన పాత్రను నిర్ణయిస్తారని చెప్పారు.
బీజేపీ వ్యాపింపజేస్తున్న ద్వేషం, విద్వేషానికి వ్యతిరేకంగా పోరాడటమే భారత్ జోడో యాత్ర ఆలోచన అని చెప్పారు. తాము దేశవ్యాప్తంగా 3, 500 కి.మీ నడిస్తూ ప్రజలను ఆహ్వానిస్తున్నామని.. లక్షలాది మంది చేరుతున్నాని అన్నారు . భారతదేశం యొక్క నిజమైన భావాలు, విలువలను ప్రదర్శించడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం అని అన్నారు. చాలా మంద్రి కాంగ్రెస్ కార్యకర్తలు యాత్రలో పాల్గొంటున్నారని.. కాంగ్రెస్ పార్టీకి చెందనివారు కూడా వస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీల కార్యకర్తలు కూడా ఈ యాత్రలో చేరడానికి వస్తున్నారని తెలిపారు.
వ్యవస్థీకృత దాడుల ద్వారా మన దేశ సంస్థాగత చట్రానికి చాలా నష్టం జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రెస్‌ను ఎలా కంట్రోల్ చేస్తున్నారో, బెదిరిస్తున్నారో మీడియాలోని వ్యక్తులకు తెలుసునని అన్నారు. న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ కూడా దాడికి గురవుతున్నాయని ఆరోపించారు. ఇక, ఓ ప్రశ్నకు సమాధానంగా గుజరాత్‌లోని మోర్బీలో చోటుచేసుకున్న ప్రమాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని చెప్పారు.
