కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈ రోజు ఉదయం కొడంగల్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు.  రేవంత్ ని అరెస్ట్ చేయడంతోనే టీఆర్ఎస్ ఓటమి ఖాయమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

మంగళవారం రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు, కొందరు భజన పరులు మాత్రమే టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణలో కూటమిని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఆయన అన్నారు.

కేసీఆర్ పాలన పై ప్రజల్లో ద్వేషం, అసహ్యం నెలకొందని మండిపడ్డారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థికి 15కోట్లకు పైగా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా వాహనాలు, 108 వాహనాల్లో డబ్బులు తరలిస్తుంటే.. ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ని చూస్తే.. కేసీఆర్ కి వణుకు పుట్టుకొస్తుందని.. అందుకే భయంతో అరెస్టు చేయించారన్నారు.