గత కొంతకాలంగా... చోరీలకు పాల్పడుతూ... పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న గుమార్ గ్యాంగ్ ఎట్టకేలకు రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.తెలంగాణలో 8, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆరు కేసుల్లో నిందితులుగా ఉన్న ఏడుగురి ముఠాను పోలీసులు పెద్ద అంబర్ పేటలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠా వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం మీడియాకు వెల్లడించారు.

కొన్ని దశాబ్దాల కింద బంగ్లాదేశ్ నుంచి నొమాడిక్(గుమాన్) తెగ పశ్చిమ బంగకు వలసవచ్చింది. వారు రోడ్డుకి ఇరువైపులా తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేసుకోని బొమ్మలు, దుప్పట్లు విక్రయించేవారు. ప్రస్తుతం వారు తమ మకాంని మహారాష్ట్రకు మార్చారు. మూడేళ్ల కిందట ఈ ముఠా ఏర్పడింది. ముఠా సభ్యులంతా ముస్లింలు కాగా... దుర్గామాతను ఆరాధించేవారు.

చోరీ చేసిన ప్రతిసారి... అమ్మవారిని దర్శించుకోవడం వీరికి అలవాటు.తొలిసారి ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ కి వచ్చారు. తొలిరోజు ఉప్పల్, చైతన్యపురి, ఎల్బీనగర్, పద్మారావునగర్, చందానగర్ లోని పలు కాలనీల్లో రెక్కీ నిర్వహించారు. చైతన్యపురిలోని ఓ ఇంట్లో దోపీడికీ ప్రయత్నించారు. కాపలాదారుడు గద్ధించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత వారి కన్ను హయత్ నగర్ పై పడింది.

రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేశారు. ఆ చోరీ సొమ్మను నగరంలో అమ్మేందుకు ప్రయత్నించగా.. ఎవరూ ఆ సొమ్మును కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో.. సొంత గ్రామానికి వెళ్లి అక్కడ అమ్ముకున్నారు. నవంబర్ 20వ తేదీన ఈసారి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ జాతీయ రహదారి కి సమీపంలో ని ఓ హోటల్ రాత్రి 11గంటల వరకు ఉండి.. ఆ తర్వాత కనకదుర్గ కాలనీకి చేరుకున్నారు. అక్కడ రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు.

ఎంతో కాలంగా పోలీసులు వీరి కోసం గాలిస్తుండగా... తాజాగా దొంగలను గుర్తించి పక్కా పథకం ప్రకారం వారిని పట్టుకోగలిగారు. నిందితులు మహారాష్ట్రలోని అకోలాకు చెందిన తారాసింగ్(30), ఎండీ సోనూ(24), బిట్టు(25), గుఫ్తాన్(20), సైఫ్ అలీ(20), సాదిఖ్(20)లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.6.55లక్షల విలువైన 150గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలను, 4 స్మార్ట్ ఫోన్లు రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.