ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. దుబాయిలో అమ్మాయిలను అమ్మేసిన వ్యక్తిని రాచకొండ ఎస్వోటీ  పోలీసులు  మంగళవారం అరెస్టు చేశారు. శ్రీనుబాబు  అనే వ్యక్తి మరో ఇద్దరు సహచరుల (పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను, సత్యవతి)తో కలిసి దుబాయ్‌లో ఉద్యోగాలిస్తామని  అమాయకులను దుబాయ్ తీసుకెళ్లి అక్కడి ఏజెంట్లకు అమ్మేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు వివాహిత మహిళల్ని మభ్యపెట్టేవారు. దుబాయ్‌లో పనిచేసే మహిళలకు నెలకు రూ.30వేల వరకు జీతం వస్తుందని ఆశపెట్టేవారు. తామే వీసాలు ఏర్పాటు చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసేవారు. అయితే వారికి వర్క్‌ పర్మిట్‌ వీసా కాకుండా విజిట్‌ వీసాలను పంపించేవారు.

 ఇక్కడ మహిళల్ని తీరా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీలకు అమ్మేసేవారు. అనంతరం అక్కడ బాధితురాళ్లపై లైంగిక వేధింపులు మొదలయ్యేవి. కొన్నిసార్లు దుబాయ్‌ షేక్‌లు బాధితురాళ్లను కొనుగోలు చేసేవారు.

ఇదేక్రమంలో ఘట్‌కేసర్‌కు చెందిన ఓ మహిళతోపాటు ఆమె భర్తను దుబాయ్‌కు తీసుకెళ్లారు. ఇందుకోసం రూ.నాలుగు లక్షలు వసూలు చేశారు. ముందుగా బాధితురాలిని తీసుకెళ్లి అక్కడి మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీకి అమ్మేశారు. అక్కడ పనిచేసేందుకు బాధితురాలు నిరాకరించడంతో వేతనం ఇవ్వకుండా ఉంచారు. కొన్ని రోజుల తర్వాత బాధితురాలి భర్త అక్కడికి వెళ్లడంతో ముఠా నిర్వాకం బట్టబయలైంది. 

ఈ విషయంపై భార్యాభర్తలిద్దరు దుబాయ్‌ శ్రీను ముఠాతో గొడవ పడటంతో దంపతులను తిరిగి హైదరాబాద్‌కు పంపించేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.