1999లో బొమ్మల రామారం పోలీసు స్టేషన్ పై నక్సలైట్ల దాడి ఘటనను గుర్తు చేసుకుంటూ అప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన మెయిన్ సెంట్రీ గుత్త వెంకట్ రెడ్డి రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తాజాగా అభినందించారు. దాడి జరిగినప్పుడు నల్లగొండ ఏఎస్పీగా డీఎస్ చౌహాన్ పని చేశారు.
హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ బొమ్మల రామారం పోలీసు స్టేషన్ పై 1999లో సాయుధ నక్సలైట్లు దాడి చేశారు. ఆ నక్సలైట్ల దాడిని ప్రాణాలకు తెగించి ముందుండి పోరాడిన ఏడుగురు పోలీసు సిబ్బందిలో కానిస్టేబుల్ గుత్త వెంకట్ రెడ్డి ఉన్నారు. అలనాటి ఘటనను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఐపీఎస్ తాజాగా గుర్తు చేశారు. గుత్త వెంకట్ రెడ్డిని తన నేరెడ్‌మెంట్‌లోని తన ఆఫీసుకు పిలుపించుకుని అభినందించారు. అప్పుడు నల్లగొండ ఏఎస్పీగా డీఎస్ చౌహాన్ పని చేశారు.
1999 జనవరి 30న బొమ్మల రామారం పీఎస్ మీద హఠాత్తుగా సాయుధ నక్సలైట్లు దాడి చేశారు. దాడి జరిగినప్పుడు మెయిన్ సెంట్రీగా గుత్త వెంకట్ రెడ్డి ఉన్నారు. అప్పుడు అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ హోరాహోరీ పోరు జరిగింది.ఆ పోరులో నలభైకి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడిని ప్రధానంగా కానిస్టేబుల్ గుత్త వెంకట్ రెడ్డి, తోటి ఆరుగురు సిబ్బందితో కలిసి ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన కాలులో బుల్లెట్ దిగి ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. ఆ వీరోచిత పోరాటంలో నక్సలైట్ల నుంచి పోలీసు స్టేషన్‌ను, సిబ్బందిని రక్షించారు.
ఈ దాడిలో పోలీసుల వైపు ప్రాణ నష్టం జరగలేదు. కాగా, దాడి చేయడానికి వచ్చిన వైపు నుంచి ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఆ దాడిని ఎదుర్కోవడంలో పోలీసులు చూపిన ధైర్య సాహసాలను డిపార్ట్‌మెంట్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని, ఆ దాడిలో పోరాడిన పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాచకొండ కమిషనర్ తెలిపారు. వారికి తగిన గుర్తింపు కూడా ఇస్తుందని అన్నారు.
వెంకట్ రెడ్డి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, చౌహాన్ ఏఎస్పీగా ఉన్నప్పుడు కిందిస్థాయి సిబ్బందికి సలహాలు ఇస్తుండేవారని అన్నారు.
ఏ ఆపద ఉన్నా తనను సంప్రదించమని వెంకట్ రెడ్డికి భరోసా ఇచ్చారు. అంతేకాదు, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న వెంకట్ రెడ్డి కూతురు స్నేహ రెడ్డిని అభినందించి, ప్రిపరేషన్‌కు అవసరమైన గైడెన్స్, ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.
