హైదరాబాద్: గత కొంతకాలంగా తన రాజకీయ భవితవ్యంపై గందరగోళానికి గురైన బీసీ జాతీయ నేత తాజామాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఎట్టకేలకు తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను మళ్లీ ఎల్బీ నగర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపార్టీ నుంచి బరిలోకి దిగుతాననే విషయంపై స్పష్టత ఇవ్వని ఆయన త్వరలోనే ఎల్బీనగర్ లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.  
  
ఆర్. కృష్ణయ్య 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లపాటు ఓ వెలుగువెలిగిన ఆయన ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యేగా కూడా కనీసం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. 

అయితే ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుపెట్టుకున్న నేపథ్యంలోనూ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ తనను సంప్రదించలేదని ఆయన వాపోయారు. టీడీపీలో ఏం జరుగుతుందో కనీసం సమాచారం కూడా తనకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను టీడీపీ వాడుకుందని తాను టీడీపీని వదిలెయ్యలేదని ఆర్ కృష్ణయ్య తెలిపారు. 

ఇకపోతే ప్రజాకూటమిలో తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న అభ్యర్ధుల జాబితాలో ఆర్ కృష్ణయ్య పేరును పొందుపరచలేదు. దీంతో ఆర్ కృష్ణయ్య గుర్రుగా ఉన్నారు. తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని మండిపడ్డారు. ఇక అప్పటి నుంచి టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆర్ కృష్ణయ్య గతంలో బీసీ నేతలతో సమావేశమయ్యారు. 

త్వరలోనే పార్టీ ఏర్పాటు చెయ్యబోతున్నట్లు ప్రకటించారు కూడా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అయితే తొలుత తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడే దృష్టిసారిస్తామని తెలిపారు. అంతేకాదు తమకు పొత్తులు కూడా అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉంటే ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇటీవలే టీఆర్ఎస్ అసమ్మతి నేత టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య కూడా కలవబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ లోకి ఆర్ కృష్ణయ్య చేరిక లాంఛనమే అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు.  

అయితే తాజాగా తాను ఎల్ బీనగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే టీడీపీ పక్కన పెట్టడంతో  బిఎల్ఎఫ్ తరఫున బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బిఎల్ ఎఫ్ తరపున సీఎం అభ్యర్థిగా కూడా ఆర్ కృష్ణయ్యను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.