టీ-టీడీపీకి షాక్...గుడ్ బై చెప్పనున్న బీసీ నేత

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 10, Sep 2018, 3:41 PM IST
R Krishnaiah may quit Telugu Desam
Highlights

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై కనీసం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న కృష్ణయ్య పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై కనీసం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న కృష్ణయ్య పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. టిక్కెట్లు రాని చోట అసమ్మతి సెగలు కొన్ని పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరికొన్ని పార్టీలు మహాకూటమి అంటూ నానా హంగామా చేస్తుంది. పొత్తులు సీట్లుపై ఓ కొలిక్కి రాకపోవడంతో కూటమి కూర్చోవడంతోనే సరిపెట్టేసుకుంటుంది. పొత్తుల నేపథ్యంలో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని కొందరు నేతలు ముందే జాగ్రత్త పడుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. తనకు తెలుగుదేశం పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను 2014 ఎన్నికల నాటి నుంచి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోతున్నారు కృష్ణయ్య. 2014ఎన్నికల్లో తనను టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఏనాడూ కనీస మర్యాద ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశంపై తన నిర్ణయాన్ని కూడా అడగలేదని అనుచరుల వద్ద వాపోయారు. పొత్తు గురించి కనీసం ఒక్క మాటైనా తనతో చెప్పలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను, బీసీలను టీడీపీ మోసం చేస్తుందని ఇక టీడీపీలో ఇమడలేనని సన్నిహితులకు తేల్చి చెప్పేశారు. రెండు మూడు రోజుల్లో ఆర్ కృష్ణయ్య టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.  

టీడీపీకి రాజీనామా చేస్తే ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలో చేరతారనేది మాత్రం బయటపెట్టడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక ఉభయ రాష్ట్రాల్లో బీసీ సంఘం నేతగా మళ్లీ పోరాట బాట పడతారా అన్నది తేలాల్సి ఉంది. 
 

loader