హైదరాబాద్ లో ముఖ్యమైన పండగల్లో రంజాన్ కూడా ఒకటి. ఆ మిడ్ నైట్ షాపింగులు, హలీం, ఒక్కటేమిటి నగరం ఈ రంజాన్ మాసంలో బోలెడంత శోభను సంతరించుకుంటుంది. 

కానీ ఈసారి మాత్రం కరోనా వైరస్ దెబ్బకు రంజాన్ మాసమంతా కూడా లాక్ డౌన్ లోనే గడిచిపోయింది. హలీం ఊసే లేదు. రంజాన్ పర్వదినం కూడా లాక్ డౌన్ కాలంలోనే జరుపుకోవలిసి వస్తుండడంతో.... ప్రజలంతా కేవలం ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని అనుకుంటున్నారు తప్ప ఇంతకు పూర్వంలా ఆ పండగ శోభా మాత్రం ఉండబోవడం లేదు. 

ఈ ప్రస్తుత కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ పరిస్థితిని చూస్తుంటే... 1908 వ సంవత్సరం గుర్తుకు వస్తుంది. ఆ సంవత్సరం కూడా రంజాన్ మాసమంతా ఇలానే ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సాగింది. ప్రజలంతా చాలా సింపుల్ గా పండగను జరుపుకున్నారు. ఇప్పుడు పండగ ఇలా సింపుల్ గా జరుపుకోవడానికి కారణం కరోనా అయితే... అప్పుడు మాత్రం మూసి వరదలు మిగిల్చిన బీభత్సము. 

1908 లో సెప్టెంబర్ 27న ఆకాశంలో నెలపొడుపు కనబడడంతో తెల్లారి నుండి రంజాన్ ఉపవాస దీక్షలకు ఉపక్రమిద్దామని అనుకున్నారు. కానీ తర్వాతి రెండు రోజులు హైదరాబాద్ నగర చరిత్రలో అత్యంత భయంకరమైన రోజులుగా ఎప్పటికి గుర్తుండిపోతాయి. 

ఒక్క రోజున్నర వ్యవధిలోనే దాదాపుగా 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో మూసి ఉప్పొంగింది. మూసి ఉగ్రరూపం దాల్చడంతో దాదాపుగా 15 వేల మంది మరణించారు. ఆఫ్జల్ గంజ్ ఆసుపత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. 

8000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అప్పటి మొత్తం హైదరాబాద్ జనాభాలో 8 శాతం మంది మరణించారంటే... ఈ ఉపద్రవం సృష్టించిన విలయతాండవం ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. 

అప్పుడు రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రజలెవరూ కొత్త బట్టలు కొనలేదు. పండగ సంబరాలన్నిటిని పక్కనపెట్టేసి ఆ డబ్బును వరద బాధితుల సహాయార్థం ఖర్చుపెట్టారు. 

మరల 112 సంవత్సరాల తరువాత ఇప్పుడు హైదరాబాద్ మరోసారి ఆ పరిస్థితిని ఎదుర్కొంటుంది. కరోనా వైరస్ వల్ల ప్రజలెవరూ రెండు నెలలుగా ఇండ్లలోంచి బయటకు వెళ్లకుండా ఉన్నారు. అందరూ తమ తమ జీవనోపాధులను కోల్పోయి దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. 

పరిస్థితి ఇలా ఉండడంతో ప్రజలంతా కూడా రంజాన్ పండగను భారీ ఎత్తున నిర్వహించవద్దని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది ఈ పండగకి బట్టలు కొనొద్దు అంటూ ప్రచారం చేస్తూ.... ఆ డబ్బును పేదల సహాయార్థం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. 

112 సంవత్సర కిందటి పండగకి, ఇప్పటి పండగకి అనేక సారూప్యతలు కనబడుతున్నప్పటికీ... ఒక తేడా మాత్రం ఉంది. అప్పుడు మసీదులు, ఈద్ గా లు తెరుచుకుంటే... ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనబడడం లేదు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు వాటికి ఈసారి అనుమతులు లేవు.