హైదరాబాద్: తమ చిన్నమ్మ సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై బిజెపి నేత, పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ నిప్పులు చెరిగారు. తమ చిన్నమ్మ వాణిదేవికి కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని ఆయన సోమవారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఓడిపోేయ స్థానంలో తమ చిన్నమ్మకు అవకాశం కల్పించారని ఆయన అన్నారు. 

కుటిల రాజకీయాలతో మహా మనీషి పెరు చెప్పి తమ కుటుంబాన్ని కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. బ్రాహ్మణుల ఓట్లు చీల్చడానికే కేసీఆర్ వాణిదేవికి టికెట్ ఇచ్చారని ఆయన విమర్శించారు. పీవీ కూతురిని బలిపశువును చేస్తున్నారని ఆయన విమర్సించారు. 

తనపై కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ పోటీ చేసినా ఓడిపోతారని ఆయన అన్నారు. పీవీ కూతురిని రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. కేవలం ఓడించడం కోసమే పీవీ కుటుంబాన్ని కేసీఆర్ రోడ్డు మీదికి తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇదిలావుంటే, వాణిదేవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. రాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్ఎస్ పీవీ కూతురు వాణిదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని ఆయన అన్ారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గౌరవిస్తూ అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన సూచనలో అర్థం లేదని ఆయన అన్ారు. 

పీవీపై నిజంగానే అభిమానం ఉంటే ఆయన కూతురికి రాజ్యసభ సీటు గానీ గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ సీటు గానీ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఎవరూ లేరని, దీంతో రాజకీయ ప్రయోజనం కోసం పీవీ కుటుంబాన్ని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. గెలవడానికి అవకాశం లేని ఎమ్మెల్సీ స్థానంలో అవకాశం ఇచ్చి ఆ కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేయవద్దని ఆయన సూచించారు.