Phone tapping case: ఆ ఇద్దరు అడిషనల్ ఎస్పీ అధికారులను కస్టడీకి ఇవ్వండి: కోర్టుకు విజ్ఞప్తి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలను కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వారిద్దరినీ శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలను కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రమే ఆ ఇద్దరినీ ఈ కేసులో అరెస్టు చేశారు. అదనపు డీసీపీ, సీఎస్‌డబ్ల్యూ తిరుపతన్న, అదనపు ఎస్పీ భూపాలపల్లి ఎన్ భుజంగ రావులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. వీరిద్దరూ గతంలో ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా, ఇంటెలిజెన్స్ శాఖలో అదనపు ఎస్పీగా పని చేశారు. శనివారం రాత్రే వీరిని రిమాండ్‌లోకి తీసుకున్నారు.
ప్రైవేటు వ్యక్తులపై అక్రమంగా నిఘా వేశారని, వారి ప్రొఫైల్స్ డెవలప్ చేశామని వీరిద్దరూ అంగీకరించినట్టు డీసీపీ (వెస్ట్) ఎస్ఎం విజయ్ కుమార్ వెల్లడించారు. వారి అధికారాలను దుర్వినియోగం చేసినట్టు ఈ పనుల ద్వారా స్పష్టమయ్యాయని తెలిపారు. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుతో తమకు సంబంధాలు ఉన్నాయనే ఆధారాలను కప్పిపుచ్చడానికి పబ్లిక్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేసినట్టు ఒప్పుకున్నారని వివరించారు. ప్రణీత్ రావు, మరికొందరితో వారు కలిసి పని చేసిన విషయాన్ని దాచాలని ప్రయత్నించినట్టు అంగీకరించారని తెలిపారు.
కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కొందరు పోలీసు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. తాను చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్టు, జూన్ లేదా జులై నెలలో మళ్లీ హైదరాబాద్ వస్తారని చెప్పినట్టు సమాచారం.