వరద సాయం నిలిపివేతపై హైదరాబాద్‌లో వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్‌లలో నిల్చున్నామని.. రేపటి కోసం కూడా టోకెన్లు తీసుకున్నామని వారు చెబుతున్నారు.

మూడు రోజుల నుంచి పనులన్నీ పక్కనబెట్టి మీ సేవ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఎన్నికల తర్వాత డబ్బులు ఇస్తామంటే ఎలా నమ్ముతామని జనం ప్రశ్నిస్తున్నారు. 

కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని ఎస్ ఈసీ సూచించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్వర్వుల్లో పేర్కొంది. 

వరద సాయంపై పలు రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని…వరద సాయం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయా పార్టీ నేతలు చెప్పడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.