పబ్జీ గేమ్.. ప్రస్తుత యువత బాగా మెచ్చిన వీడియో గేమ్ ఇది. అన్నం, నిద్ర మానేసి మరీ.. ఈ గేమ్ ఆడేవారు ఉన్నారు. కాగా  తాజాగా ఇదే గేమ్‌కు బానిసలా మారిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగింది.
 
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్‌కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. గమనించిన తల్లిదండ్రలు అతడిని మందలించారు. అయినా, అతడు వారి మాటను వినలేదు. 

దీంతో గేమ్ ఆడవద్దంటూ గట్టిగా చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కొడుకు గదిలో ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో వచ్చి చూసే సరికి సాయిచరణ్ ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించాడు. 

పక్కింటి వారి సాయంతో తలుపులు పగలకొట్టి అతడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే సాయిచరణ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.