పబ్ జీ గేమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎప్పుడూ ఫోన్ పట్టుకుని గేమ్ ఆడుతూ కూర్చున్నావని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓంకార్ అనే బాలుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెలికచర్లలో గురువారం జరిగింది. 

బండవెలికచర్లలోని ఉప్పరి అనంతయ్య దంపతులు కుల్కచర్లలో పండ్లు అమ్ముతారు. 
వీరి చిన్న కుమారుడు ఓంకార్‌ (15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి.

దీంతో అనంతయ్య అప్పు చేసి మరీ మూడు నెలల క్రితం కొడుకు కోసం సెల్‌ఫోన్‌ కొన్నాడు. బాలుడు నిత్యం ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో పబ్‌జీ గేమ్‌ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన అనంతయ్య గురువారం కుమారుడిని మందలించాడు. ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటున్నావని.. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులున్నప్పుడే వినాలని చెప్పాడు.

ఫోన్‌ ఎక్కువగా వాడితే ఆరోగ్యం పాడవుతుందన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఓంకార్‌ ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.