ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాత, వైసీపీ నేత పీవీపీ ఉరఫ్ పొట్లూరి వర ప్రసాద్ కు హై కోర్టులో ఊరట లభించింది. పీవీపీ ని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసులు ఆయన ను అరెస్ట్ చేయకుండా ఆయన కోర్టును ఆశ్రయించడంతో ...  కోర్టు ఈ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. జులై 27కు తదుపరి విచారణ నిమిత్తం కేసును వాయిదా వేసింది కోర్ట్.  

తదుపరి ఆదేశాల వరకు ఆయన ను అరెస్ట్ చేయకూడదంటూ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పక్క బిల్డింగ్ ఓనర్ పై దౌర్జన్యం చేసి వారి ఇంట్లోకి తన మనుషులతో కలిసి హల్చల్ చేసిన కేసులో పోలీసులు ఆయనపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 

రెండు రోజుల కింద పీవీపీ పోలీసుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ పీవీపీపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

దీనిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం. 82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో వరప్రసాద్ వారిపై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు.

ఈ హఠాత్పరినామంతో ఖంగుతిన్న పోలీసులు భయాందోళనకు గురై బయటకు వచ్చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై హరీశ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో, ఐపీసీ సెక్షన్ 353 కింద పీవీపీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

కేసు వివరాల్లోకి వెళ్తే...  బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో తన నివాసం పక్కనే కైలాష్ విక్రం అనే వ్యక్తి ఇంటిని నిర్మాణం చేస్తున్నాడు. పీవీపి అనుచరులం అని కొందరు తనపై దాడి చేశారని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కైలాష్ ఫిర్యాదు చేశాడు. స్థలానికి సంబంధించిన పత్రాలు తనవద్ద ఉన్నాయని చెప్పినా వినకుండా దాడి చేశారని పోలీసులకు తెలిపాడు. 

‘‘రూఫ్ టాప్ గార్డెన్ కడితే కూల్చేస్తానని పీవీపీ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల క్రితమే ఇంటిని కొనుగోలు చేశాం. ఇటీవలే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆరు నెలల క్రితం ఫోన్లో బెదిరించారు. మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. ఆయన ఇల్లు మా ఇంటి వెనుక ఉంటుంది. ఆయన ఇల్లు సరిగా కనిపించదని పీవీపీ అంటున్నారు’’అని బాధితుడు మీడియాకు తెలిపారు.