తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠతో గమనిస్తోన్న మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 100 మంది అభ్యర్ధులు బరిలో నిలిచినట్లుగా తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇప్పటికే నామినేషన్ల వేసిన వారి సంఖ్య సెంచరీ దాటింది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతిలు నామినేషన్ వేశారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 3న పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు.. ఇప్పటికే నామినేషన్ వేసిన ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. పలు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే... మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తఓటర్ల నమోదుకు సంబంధించి ఈ నెల 21 వ తేదీ లోపుగా పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ALso Read:కేసీఆర్ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించే కుట్ర: బీజేపీపై గుత్తా సుఖేందర్ రెడ్డి
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని రెండు నెలల వ్యవధిలో 25 వేల మంది కొత్తగా ఓటు హక్కు నమోదుకోసం దరఖాస్తు చేసుకున్నారు.అయితే వీరిలో ఎక్కువ మంది దరఖాస్తులు బోగస్ అని బీజేపీ ఆరోపించింది. ఇదే అభిప్రాయంతో కాంగ్రెస్ కూడా ఉంది. కొత్తగా నమోదైన ఓటర్లలో అసలు ఓటర్లను తేల్చిన తర్వాతే ఓటర్ల జాబితా విడుదలకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ ఈ నెల 11న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై నిన్న తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు నమోదైన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. 25 వేల మంది కొత్తగా ఓటరు నమోదు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అయితే 12 వేల దరఖాస్తులకు మాత్రమే అనుమతివ్వాలని కోర్టు ఆదేశించింది. 13 వేల ఓట్లలో 7 వేల ఓట్లను అనుమతించలేదని ఈసీ హైకోర్టుకు తెలిపింది. మిగిలిన ఆరు వేల ఓట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఈసీ హైకోర్టుకు తెలిపింది. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఈనెల 21న పూర్తి నివేదికను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఈసీని ఆదేశించింది. కొత్త ఓటరు నమోదు జాబితాను విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని నిన్ననే హైకోర్టు స్పష్టం చేసింది.
