Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోడీ చేతిలో.. ల్యాండ్, శాండ్, వైన్ ‌మాఫియాలతో బీఆర్ఎస్ దోపిడీ : ప్రియాంకా గాంధీ

బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోడీ చేతిలో వుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు . బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారని ఆమె ఆరోపించారు. 

priyanka gandhi sensational comments on brs and bjp at congress public meeting in mulugu ksp
Author
First Published Oct 18, 2023, 7:02 PM IST

బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోడీ చేతిలో వుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. బుధవారం ములుగులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, వైన్ మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని వేల కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ పెద్దలు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. భూదాన్ భూములను ఆన్‌లైన్‌లో తొలగించి , ఆక్రమించుకున్నారని ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారని ప్రియాంక దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారని ఆమె ఆరోపించారు. 

18 మంత్రిత్వ శాఖలు కేసీఆర్ కుటుంబం చేతిలోనే వున్నాయని ప్రియాంక ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముగ్గురే బీసీ మంత్రులు వున్నారని ఆమె దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం న్యాయం జరగటం లేదని ఆమె పేర్కొన్నారు. కులగణన చేయమంటే మోడీ సర్కార్ ముందుకు రావడం లేదని.. ఎవరి జనాభా ఎంత వుందో తెలియకుండా న్యాయం ఎలా చేస్తారని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ట్రైబల్ వర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ, ఉక్కు పరిశ్రమ పెడతామని మోడీ హామీ ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ సంస్థలను మోడీ అమ్ముతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ తన స్నేహితులకు అమ్ముతున్నారని దుయ్యబట్టారు. 

సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని , ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని , రైతుల జీవితం బాగుపడుతుందని ఆశించారని ప్రియాంక గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందన్నారు. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రియాంక పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారని.. కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు.  రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రియాంక తెలిపారు.

రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరికను సోనియా నెరవేర్చారని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రియాంక తెలిపారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించారని ఆమె వెల్లడించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలను ఇచ్చారని ప్రియాంక గాంధీ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఓ రూట్‌మ్యాప్ రూపొందించిందని.. ప్రజల కోసం ఆరు గ్యారెంటీలను తీసుకొస్తుందని ఆమె చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చేలా గ్యారెంటీ కార్డు ఇస్తున్నామన్నారు. 

కుటుంబంలో మహిళలు ఎంత కష్టపడుతున్నారో తమకు తెలుసునని.. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకే రూ.500 గ్యాస్ ఇవ్వాలని నిర్ణయించామని ప్రియాంక చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత, ఉద్యోగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రియాంక దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ భారీగా అవినీతి జరుగుతోందని.. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరగలేదన్నారు.

 ప్రభుత్వ వర్సిటీలను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వర్సీటీలను ప్రోత్సహిస్తున్నారని ప్రియాంకా గాంధీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని , నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రత్యేక గల్ఫ్ సెల్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని.. అన్ని పంటలకు మద్ధతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. రైతులకు రూ.2 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని .. రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్నారు. 

భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని.. పేద మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చి సహాయపడతామని ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు. గిరిజనులు అంటే ఇందిరా గాంధీ, సోనియా గాంధీలకు ఎంతో ఇష్టమని ఆమె గుర్తుచేశారు. గిరిజనుల సంస్కృతిని కాపాడేందుకు ఎంతో కృషి చేశారని.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రియాంక తెలిపారు. అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీలకు రూ.12 లక్షల సహాయం చేస్తామని.. ఇందిరమ్మ ఇల్లు కింద ఎస్టీలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 8 లక్షల ఎకరాలు పంపిణీ చేసిందని.. 18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని ఆమె తెలిపారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు  రూ.2500 ఇస్తామని ప్రియాంక చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios