Asianet News TeluguAsianet News Telugu

లైసెన్సుల రద్దు, ఆంక్షలు: తెలంగాణ డీహెచ్ కార్యాలయానికి .. కార్పోరేట్ ఆసుపత్రుల అధినేతల క్యూ

తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీస్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూకడుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తున్నాయి.

private hospital owners meet telangana director of health srinivasrao ksp
Author
Hyderabad, First Published Jun 2, 2021, 7:37 PM IST

తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీస్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూకడుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం డీహెచ్‌ శ్రీనివాస్‌రావుతో ఆ ఆసుపత్రుల అధినేతలు వేర్వేరుగా భేటీ అవుతున్నారు. కిమ్స్ భాస్కర్‌రావు, సన్‌షైన్ గురువారెడ్డి సహా ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు కలిశారు.

తమ ఆస్పత్రులకు కొవిడ్ లైసెన్స్‌ రద్దు చేయడంపై ఆరా తీశారు. ఫిర్యాదు చేసిన పేషెంట్స్‌ బిల్‌ కాపీలను డీహెచ్‌కు మరోసారి అందజేశారు. తమ ఆస్పత్రులను మంచి రెప్యుటేషన్‌తో నడుపుకుంటున్నామని .. అది పోవాలని కోరుకోవడం లేదని వారు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు, కొవిడ్ లైసెన్స్ రద్దుపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.  రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున లైసెన్స్ రద్దు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని డీహెచ్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు వివరించారు. అయితే ఈ వరుస భేటీలు మాత్రం తెలుగు నాట హాట్ టాపిక్‌గా మారాయి. 

Also Read:ప్రైవేట్ ఆసుపత్రుల నుండి అధిక ఫీజులు బాధితులకు రీఫండ్ చేయించాలి: తెలంగాణ హైకోర్టు

అంతకుముందు అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల పై ఎలాంటి చర్యలు తీసుకొన్నారని బుధవారం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 174 ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. 21 ఆసుపత్రుల కోవిడ్ అనుమతులు రద్దు చేసినట్టుగా చెప్పారు. బాధితుల నుండి అధికంగా వసూలు చేసిన ఫీజులను ఆసుపత్రులు చెల్లించాయా అని  హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్సుల రద్దు కంటే బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించడమే ముఖ్యమని కోర్టు తెలిపింది.అధిక ఫీజులు వసూలు చేసిన చార్జీలు తిరిగి ఇవ్వకపోతే  లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 

లైసెన్సులు రద్దు చేశాక ఆసుపత్రులు బాధితులకు డబ్బులు ఇవ్వకుండా మొండికేస్తాయి... మెడపై కత్తి పెట్టి బాధితులకు డబ్బులు ఇప్పించాలని  కానీ తలను నరికేస్తే ఏం లాభమని హైకోర్టు వ్యాఖ్యానించింది.తొలి దశ కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుండి రూ. 3కోట్లను బాధితులకు ఇప్పించినట్టుగా వైద్య ఆరోగ్యశాఖాధకారి శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు ధరలను నిర్ణయించారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే గత ఏడాది జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కొత్తగా జీవో జారీ చేయాలని హైకోర్టు సూచించింది. థర్డ్ వేవ్ ను ఎలా ఎదుర్కొంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తాము సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు డీహెచ్ తెలిపారు. అయితే ఈ విషయమై బ్లూ ప్రింట్ ఇవ్వాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios