హైదరాబాద్: కరోనా సమయంలో  మానవత్వంలో వ్యవహరించాల్సి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు  డబ్బుల కోసం మృతదేహాలను ఇవ్వడం లేదని  బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. నగరంలోని ఎల్బీనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ నెల 17న డెవిల్ అనే వ్యక్తి కరోనాతో చికిత్స కోసం చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 25న మరణించారు. ఫీజు చెల్లిస్తేనే డెడ్ బాడీ ఇస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో బాధిత కుటుంబం ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగింది. 

ఇదిలా ఉంటే కాప్రాలోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఐదు రోజుల క్రితం వాసు అనే వ్యక్తి  కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.  ఇప్పటికే రూ. 1.5 లక్షలను ఆసుపత్రికి చెల్లించింది బాధిత కుటుంబం. ఇంకా  రూ. 2 లక్షలు చెల్లిస్తేనే డెడ్‌బాడీ ఇస్తామని ఆసుపత్రివర్గాలు తమను వేధిస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. 

గతంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో డాక్టర్లను సైతం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేఁశాయి. ఈ విషయమై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. అయితే అన్ని ఆసుపత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విపక్షాలు అప్పట్లో ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.