హైదరాబాద్: హైద్రాబాద్ ఈసీఐఎల్‌లో బుధవారం నాడు విషాదం నెలకొంది. ఆసుపత్రికి తరలించేలోపుగానే పృథ్వీరాజ్ అనే యువకుడు మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్నారు.

హైద్రాబాద్ జవహర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్ అనే యువకుడి మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేందుకు వచ్చారు.

ఈ ఆసుపత్రిలో వైద్యులు పృథ్వీరాజ్ ను చేర్చుకొనేందుకు నిరాకరించారు. వేరే ఆసుపత్రికి వెళ్లేందుకు పృథ్వీరాజ్ ఆటో కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఆసుపత్రి వద్దే పృథ్వీరాజ్ కుప్పకూలిపోయాడు. అయితే పృథ్వీరాజ్ కిందపడిపోయినా అక్కడ ఉన్నవాళ్లు చూస్తూ ఉండిపోయారు. కానీ దగ్గరకు రాలేదు.

ఈ లోపుగా కుటుంబసభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పృథ్వీరాజ్ ను పరీక్షించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్టుగా అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఈ సమయంలో పృథ్వీరాజ్ ను ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదు. 

కరోనా కారణంగా ఎవరూ కూడ ముందుకు రాలేదు. పృథ్వీరాజ్ మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నందున ఆయనకు కరోనా సోకిందేమోననే భయంతో స్థానికులు అలాగే చూస్తూండిపోయారు. తప్ప ఆ కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.