చర్లపల్లి సెంట్రల్‌ జైల్లో షేక్‌ ఖాజామియా (35) అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు . చోరీ కేసులో అరెస్టయిన ఖాజామియాను పోలీసులు మల్కాజ్‌గిరి కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 

చర్లపల్లి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. షేక్‌ ఖాజామియా(35) రిమాండ్ ఖైదీ శనివారం టవల్‌తో జైలులోని కిటికీకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఖాజామియాను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 17 రోజుల క్రితం కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ కేసులో అరెస్టయిన ఖాజామియాను పోలీసులు మల్కాజ్‌గిరి కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అప్పటి నుంచి అతను చర్లపల్లి జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నాడు. ఖాజామియా స్వస్థలం తాళ్లగడ మిర్యాలగూడ అని జైలు అధికారులు తెలిపారు.