హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం కన్హా గ్రామ పరిధిలో శాంతివనంలో ప్రపంచంలోని అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం నాడు ప్రారంభించారు. 

రామచంద్ర మిషన్  75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని రాష్ట్రపతి  అభిప్రాయపడ్డారు. 

ధ్యాన కేంద్రంలో రాష్ట్రపతి  కోవింద్  మొక్క నాటారు. శాంతివనంలో ఉన్న లక్ష మొక్కలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయన్నారు. ధ్యాన కేంద్రం ఎంతో పవిత్రమైన స్థలమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. 

ధ్యాన కేంద్రాల్లో లక్షల మంది జనం అభ్యసించడంపై ఆయన నిర్వాహకులను అభినందించారు. రామచంద్ర మిషన్ 150 దేశాల్లో కేంద్రాలను కలిగి ఉన్న విషయాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురూజీ కమలేష్  రామచంద్ర మిషన్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆలోచనలను నియంత్రించడమే ధ్యానం అని గురూజీ కమలేష్ చెప్పారు. ఒత్తిడిలో ఉన్న వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా జీవితం కొనసాగించలేరన్నారు. ధ్యానం వల్ల  అన్ని ఒత్తిడులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.