రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు అధికారులు. ఛాతీలో అసౌకర్యంగా వుండటంతో శుక్రవారం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు రాష్ట్రపతి. అయితే వైద్య పరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

దీంతో ఎయిమ్స్ వైద్యులు రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ చేయనున్నారు. ఈ నెల 30న శస్త్రచికిత్స నిర్వహించే అవకాశం వుంది. కోవింద్‌కు మ‌రింత మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఆయ‌న‌ను ఈ రోజు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించిన‌ట్లు ప్ర‌క‌టించారు. 

రాష్ట్రపతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. కోవింద్‌ కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి రాష్ట్రపతిని పరామర్శించారు. తను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన వారికి కోవింద్‌ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.