Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. ఆర్మీ హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు పయనం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్వాగతం పలికారు. 

President Draupadi Murmu reaches shamshabad airport
Author
First Published Dec 26, 2022, 11:12 AM IST

శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బయలిదేరి వెళ్లారు. రాష్టపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా  శ్రీశైలంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిధిలోని ప్రధాన కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

శ్రీశైలంలో భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ చేపట్టిన అభివృద్దికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్నారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నట్టుగా తెలుస్తోంది. ఇక,  శీతకాల విడిదిలో భాగంగా ఆమె ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ సందర్బంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

రెండేళ్ల తర్వాత శీతకాల విడిదికి రాష్ట్రపతి.. 
శీతకాల విడిది కోసం 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చివరిసారిగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ -19 పరిస్థితుల కారణంగా రాష్ట్రపతి శీతకాల విడిది  కోసం హైదరాబాద్‌కు రాలేదు. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక, ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము.. శీతకాల విడిదికి రావడం  ఇదే తొలిసారి. ఇక, రాష్ట్రపతి బస చేయనున్న బొల్లారంలోని భవనాన్ని 1860లో నాటి నిజాం నాజిర్ ఉద్దౌలా హయాంలో నిర్మించారు. బ్రిటీష్ రెసిడెంట్ కంట్రీ హౌస్‌గా దీన్ని వినియోగించుకున్నారు. ఆపరేషన్‌ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాగా.. ఆ తర్వాత నుంచి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు.  రాష్ట్రపతి నిలయం మొత్తం 90 ఎకరాల ప్రాంగణంలో ఉండగా.. ప్రధాన భవనం 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios