మంచిర్యాల జిల్లా, చెన్నూర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి అదృశ్యమైన బాలింత.. అస్థి పంజరంగా చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. ముళ్ల పొదల్లో చెట్టుకు వేలాడుతూ కనిపించిన మహిళ ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేసి ఉరి వేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వివరాల్లోకి వెడితే...

కుమురం భీం జిల్లా దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన దాదా మానసకు, చెన్నూర్‌ మండలం నాగాపూర్‌ గ్రామానికి చెందిన రమేశ్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి చాలా కాలంగా పిల్లలు లేరు. ఈ మధ్యే గర్భవతైంది. ప్రసవం కోసం గత నెల 13న చెన్నూర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే నెల 17వ తేదీన ఆసుపత్రి నుంచి మానస అదృశ్యమైంది.

ఈ మేరకు మానస భర్త రమేష్ పోలీసు కంప్టైంట్ ఇచ్చాడు. అప్పటినుండి మానస ఆచూకీ లభించలేదు. అయితే సోమవారం చెన్నూర్ సమీపంలోని లంబాడిపల్లి గ్రామస్తులు రహదారి పక్కన ముళ్లపొదల్లో అస్థిపంజరం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. 

ఈమేరకు ట్రెయినీ ఏసీపీ అశోక్‌కుమార్, చెన్నూర్‌ సీఐ ప్రమోద్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం పరిశీలించారు. మహిళ చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఆనవాళ్లతోపాటు ఆమె చున్నీ, చెవి రింగు, వెంట్రుకల ఆధారంగా మృతదేహం మానసదిగా పోలీసులు ధ్రువీకరించారు. శవానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లైన పదిహేనేళ్ల తరువాత తల్లై.. ఆ పసిగుడ్డును పురిట్లోనే వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిన మానసను తలుచుకుని కుటుంబసభ్యులే కాదు, గ్రామస్తులంతా శోకసముద్రంలో మునిగిపోయారు.