సిద్దిపేట: కరోనాతో బాధపడుతున్న నిండు గర్భిణిని హాస్పిటల్ కు తరలిస్తుండగా అంబులెన్స్ లోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు డెలివరీ చేసి తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ  ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి  వెళితే... హుజురాబాద్ లో తొమ్మిదినెలల నిండు గర్భిణి కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పరీక్షలు నిర్వహించారు. ఆమెకు పాజిటివ్ తేలడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్ కు తరలిస్తుండగా పురిటినొప్పులు మొదలయ్యాయి. 

అయితే మార్గమద్యలో ఈ పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ సిబ్బందే ఆమెకు డెలివరీ చేయాలని నిర్ణయించారు. దీంతో శామీర్ పేట వద్ద అంబులెన్స్ ను రోడ్డుపక్కన నిలిపి ఆమెకు డెలివరీ చేశారు. తల్లీ బిడ్డలిద్దరు క్షేమంగానే వున్నట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. 

read more   మరో టీఅర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా: హోం క్వారంటైన్ లో జీవన్ రెడ్డి

ఇదిలా వుంటే హైద్రాబాద్ లో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు.. వీరంతా ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో భార్యాభర్తలు మరణించారు. ఇప్పటికే ఆసుపత్రికి రూ. 8 లక్షలు చెల్లించారు బాధిత కుటుంబం. మిగిలిన రూ. 10 లక్షలు చెల్లిస్తే మృతదేహం ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

హైద్రాబాద్ పట్టణానికి చెందిన సత్యనారాయణ రెడ్డి కుటుంబంలో ముగ్గురు కరోనాతో మరణించారు. సత్యనారాయణ రెడ్డి బుధవారం నాడు కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ కుటుంబంలో తొలుత సత్యనారాయణ రెడ్డి కొడుకు కరోనా బారినపడ్డాడు. ఆయన సోమాజీగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.