జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతున్న ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్.. మరోవైపు తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. దీంతో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను అయోమయంలో నెట్టాయి.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను అయోమయంలో నెట్టాయి. అందుకు ఒకే ఒక కారణం ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతున్న పీకే.. మరోవైపు తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక టీ కాంగ్రెస్ నేతలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు ఏమిటో.. పీకే సేవలను ఎలా ఉపయోగించాలని చూస్తుందో తెలుకునేందుకు కొందరు టీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ తర్వాత టీ కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు వచ్చింది. అంతర్గత పోరుకు ముగింపు పలికి.. నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు సాగుతున్నారు. త్వరలో వరంగల్‌లో జరిగే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తాజాగా పరిణామాలు మాత్రం వారిని ఇరకాటంలోకి నెడుతున్నాయి.
ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్‌లో చేరేందుకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఇప్పటికే.. కొన్ని రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ పరిణామాలే ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతలకు ఇబ్బందికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఐ ప్యాక్ సంస్థ టీఆర్‌ఎస్ కోసం పనిచేస్తే.. కచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్రంలో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావమే చూపే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇక, టీ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో సునీల్ తెలంగాణలో పార్టీ కోసం పనిచేయనున్నట్టుగా రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు. ఇందుకోసం సునీల్ ఇప్పటికే రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా కేసీఆర్‌తో పీకే చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుకు సంబంధించిన అంశంపై చర్చ సాగుతుంది. అయితే దీనిని మెజారిటీ టీ కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉండదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటన తర్వాత పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీఆర్ఎస్ కోసం పీకే రాజకీయ వ్యూహాలు రచించడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఉద్దేశం దెబ్బతింటుందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కిషోర్ కాంగ్రెస్‌లో చేరితే.. అతడు ప్రత్యర్థి పార్టీ కోసం పనిచేసిన నేపథ్యంలో క్యాడర్‌కు తప్పుడు సందేశాన్ని పంపినట్లు అవుతుందని ఆయన అన్నారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ గురించి, ఆయన సంస్థకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ కలవడంపై ప్రజలకు అనుమానాలు రావడం సహజమేనని అన్నారు. కానీ దానితో తమకు సంబంధం లేదని చెప్పారు. అన్ని విషయాలను హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి గందరగోళం లేదని చెప్పుకొచ్చారు.
ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో టీ కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్య నేతలు.. ఢిల్లీలో ఏం జరగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అధిష్టానానికి సన్నిహితంగా ఉండే కొందరు నేతలతో వీరు మాట్లాడినట్టుగా తెలసింది. అయితే ఎలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయవద్దని.. అంతా అధిష్టానమే చూసుకుంటుందని వారు చెప్పినట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కోసం పనిచేసేందుకు ఐ ప్యాక్ ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న పీకే.. కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సుధీర్ఘ చర్చలు జరిపారు. శనివారం రాత్రి అక్కడే బస చేసిన ప్రశాంత్ కిషోర్.. ఆదివారం కూడా గులాబీ బాస్‌తో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఐ ప్యాక్, టీఆర్‌ఎస్ మధ్య డీల్ కుదిరింది. తాను కాంగ్రెస్ చేరినప్పటికీ.. ఐ ప్యాక్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్‌తో చెప్పినట్టుగా టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక, ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే బెంగాల్‌లో తృణమూల్ కోసం, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కోసం.. పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
