హైదరాబాద్:  తెలంగాణలో ప్రణయ్ హత్య సంఘటనలాంటిదే మరో సంఘటన జరిగింది. కూతురి ప్రేమ వివాహం నచ్చని తండ్రి ఆమె భర్త హేమంత్ ను దారుణంగా హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి వద్ద హేమంత్ హత్య జరిగింది. అతన్ని ప్రేమ వివాహం చేసుకున్న యువతి మాత్రమే కారులోంచి తప్పించుకుని పారిపోయింది. 

తన కూతురి ప్రేమ వివాహం నచ్చని ఆమె తండ్రి ఆమె భర్తను కిరాయి గుండాలతో హత్య చేయించాడు. హేమంత్ ను, అతన్ని వివాహం చేసుకున్న యువతిని గురువారం మధ్యాహ్నం కిరాయి గుండాలో హైదరాబాదులోని గచ్చిబౌలిలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతన్ని హత్య చేశారు. .

తమను కిరాయి గుండాలు కిడ్నాప్ చేసిన విషయాన్ని ప్రేమజంట 100కు ఫోన్ చేశారు. పోలీసులు గాలింపు జరుగుతుండగానే దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆ జంట కొద్ది కాలం అజ్ఞాతంలోకి వెళ్లింది. తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని యువతి చెప్పడంతో ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీకి వచ్చారు.

చందానగర్ కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు.  

అంతా సద్దుమణిగిందని భావించిన తరుణంలో హేమంత్ జరిగింది. హేమంత్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. యువతి అవంతి తన తండ్రిపై ఫిర్యాదు చేసింది. తన మేనమామ పాత్ర కూడా ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

మిర్యాలగుడాలో తన కూతురు అమృత వర్షిణి ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ అనే దళిత యువకుడిని మారుతీరావు హత్య చేసిన విషయం తెలిసిందే. సుపారీ గ్యాంగ్ తోనే అతను ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ ఘటనను మరిచిపోక ముందే చందానగర్ లో తాజా సంఘటన చోటు చేసుకుంది.