Asianet News TeluguAsianet News Telugu

ప్రణయ్ హత్య.. అమృత తండ్రికి ఉరిశిక్ష...? సుప్రీం ఏం చెప్పింది..?

 ‘‘మా అభిప్రాయంలో కారణమేదైనా పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలి. ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందే’’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

pranay murder.. punishment to maruthi rao is hang to death
Author
Hyderabad, First Published Sep 17, 2018, 11:20 AM IST

మిర్యాలగూడలో కలకలం సృష్టించిన ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావుకి మరణశిక్ష పడనుందా...? అతని ఈ నేరం చేసినట్లు నిరూపణ అయితే.. కచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది.పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ చర్యలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొంది.

 ‘‘మా అభిప్రాయంలో కారణమేదైనా పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలి. ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందే’’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

గతంలో  ఢిల్లీకి చెందిన భగవాన్‌దాస్‌ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకొని పరువు తీసిందన్న కోపంతో ఆమెను హతమార్చాడు. ఆ కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది.

 ‘‘తమ కొడుకు/కూతురు ప్రవర్తన వల్ల పరువు పోయిందని చాలా మంది భావిస్తుంటారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె/అతడు ఇతర కులస్థులను పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాలు పెట్టుకోవడాన్ని అవమానంగా పరిగణిస్తారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చంపేయడం, భౌతిక దాడులకు పాల్పడడం చేస్తుంటారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. తమ కుమార్తె లేదా ఇతర వ్యక్తి ప్రవర్తన వల్ల అసంతృప్తిగా ఉంటే అతను/ఆమెతో సామాజిక సంబంధాలను తెంచేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. హింసాత్మక చర్యలకు పాల్పడకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని విచారణ కోర్టులు, హైకోర్టులు పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగానే పరిగణించాలని, దోషులకు ఉరిశిక్ష విధించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులిచ్చింది.
 

ఢిల్లీలో షియా వర్గానికి చెందిన యువతి సున్నీ వర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. దీంతో యువతి సోదరులు.. ఆ యువకుడి తమ్ముడ్ని హత్య చేశారు. 2008లో జరిగిన ఈ హత్య కేసును విచారించిన ఢిల్లీ కోర్టు దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. యువతి కుటుంబ సభ్యులు ఐదుగురికీ 2011లో ఉరిశిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో.. మారుతీరావు నేరం చేసినట్లు నిరూపించగలిగితే.. అతనికి ఉరిశిక్ష పడటం ఖాయమని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios