ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌ కేసులో మరో ట్విస్ట్ వచ్చిపడింది. అమృత తల్లి మైండ్ గేమ్ ఆడుతుందనే అనుమానం కలుగుతోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. పట్టణంలోని కార్తిక్‌ టెక్స్‌టైల్స్‌ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్‌ ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని  తరచూ ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్‌ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా  అమృత తల్లితో  అతను తరచూ మాట్లాడినట్లు అతడిసెల్‌లో ఉంది.

వారి ప్రోద్బలంతోనే వినోద్‌కుమార్‌ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం అమృత తమ అత్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ తరువాత పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సీఐ సదానాగరాజు తెలిపారు.

సెప్టెంబర్ లో ప్రణయ్ దారుణ హత్యకు గురవ్వగా.. ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో విచారణ జరుగుతోంది.