తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేసారు.

హైదరాబాద్ : అధికార బిఆర్ఎస్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని... ఇటీవల కొందరు పోలీసులు దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురిచేసారంటూ తెలంగాణ డిజిని అంజనీ కుమార్ కు పాల్ ఫిర్యాదు చేసారు. సివిల్ డ్రెస్ లో తనవద్దకు వచ్చి బెదిరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరారు కేఏ పాల్. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే పోలీసులు నవీన్ కుమార్, లక్ష్మీ లు సివిల్ డ్రెస్ లో వచ్చి తనను బెదిరించారని కేఏ పాల్ పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులే వారిని పంపించివుంటారని పాల్ అనుమానం వ్యక్తం చేసారు. ఇలా ఈ నెల 23న తనను చంపేందుకు ప్రయత్నం జరిగిందని... దీని వెనకున్న వారెవరో గుర్తించాలని డిజిపిని కోరారు ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్. 

అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాగిరి చేస్తున్నారని... వారిని కట్టడి చేయాలని డిజిపిని కోరారు పాల్. తన ఫిర్యాదుపై డిజిపి అంజనీకుమార్ సానుకూలంగా స్పందించారని... విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కేఏ పాల్ తెలిపారు.