హైదరాబాద్: ఆనందంగా కొనసాగుతున్న  వారి జీవితంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ అనే 29 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.ఈ ఘటన హైద్రాబాద్‌కు సమీపంలోని దుండిగల్‌లో  చోటు చేసుకొంది.

విశాఖపట్టణానికి చెందిన ప్రభాకర్  ఉపాధి కోసం  హైద్రాబాద్ నగరానికి వలస వచ్చాడు.  జీడిమెట్ల సమీపంలోని అపురూపకాలనీలో ఉండేవాడు. ఇక్కడకు సమీపంలోని రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు.  ఏడాది క్రితం ఓ యువతిని ప్రభాకర్ ప్రేమించారు. పెద్దల అనుమతితో  ఆ యువతిని వివాహం చసుకొన్నాడు.  అత్తింట్లోనే ప్రభాకర్ నివాసం ఉంటున్నాడు.

శుక్రవారం రాత్రి పూట విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా  ప్రభాకర్ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి   వచ్చిన సుమో ఢీ కొట్టింది. ఈ ఘటనలో  ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.  

ప్రభాకర్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ప్రభాకర్ శనివారం రాత్రి   మృతి చెందాడు.ప్రభాకర్ భార్య ప్రస్తుతం ఏడు మాసాల గర్భిణీ. గత నెలలోనే ఆమెకు సీమంతం  ఘనంగా నిర్వహించారు. ప్రభాకర్ మృతితో  ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.