తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవి ఆరంభానికి ముందే విద్యుత్ వినియోగం గత రికార్డులను బద్దలు కొడుతుంది.
తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవి ఆరంభానికి ముందే విద్యుత్ వినియోగం గత రికార్డులను బద్దలు కొడుతుంది. తాజాగా మంగళవారం రోజును తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రంలో 14, 750 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టుగా విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు 14, 649 మెగావాట్లు, 10వ తేదీన 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైన సంగతి తెలిసిందే. అయితే గతేడాది విద్యుత్ వినియోగం విషయానికి వస్తే.. మార్చి 29 అత్యధికంగా 14,166 మెగావాట్ల విద్యుత్ వినియోగం రికార్డుగా ఉంది.
అయితే వేసవికి ముందే ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉందంటే.. ఎండలు పెరిగితే విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో 16 వేల మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం ఉండవచ్చని అధికారులు అంచనాలు ఉన్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరగడానికి.. పారిశ్రామిక రంగం విస్తరణ, రాష్ట్రంలో పంటల విస్తీర్ణం పెరగడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది.
ఇక, ఇటీవల అసెంబ్లీలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు ఉండగా.. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,166 యూనిట్లుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014లో 7,778 మెగావాట్ల ఉంటే.. దానిని 2022 నాటికి 18,460 మెగావాట్లకు పెంచామని వివరించారు.
