‘‘సీడబ్ల్యూసీ అంటే కరప్ట్ వర్కింగ్ కమిటీ’’: సీడబ్ల్యూసీ మీటింగ్ వేళ హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
హైదరాబాద్ నగరంలో ఈరోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల వేళ నగరంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో ఈరోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాలు విజయవంతంగా సాగేలా టీపీసీసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. నగరానికి విచ్చేస్తున్న అగ్రనేతలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల వేళ వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో కలకలం రేపుతున్న పోస్టర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారీ పోస్టర్లు వెలిశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తెలంగాణలో అధికార బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఈ పోస్టర్లలో కాంగ్రెస్ అగ్రనేతలు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కామ్‌లను పేర్కొన్నారు.
బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్ లైన్‌ను కూడా పోస్టరల్లో ఉంచారు. సీడబ్ల్యూసీ మీటింగ్ వేళ హైదరాబాద్‌లో ఇలాంటి పోస్టర్లు దర్శనమివ్వడం రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది. ఇదిలాఉంటే, గతంలో హైదరాబాద్‌లో బీజేపీ సమావేశాలు, అగ్రనేతల పర్యటన సందర్భంలో కూడా ఇలాగే వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే.