ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 

మెట్రో రైలు ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడి మౌనిక అనే యువతిపై పడ్డాయి. నేరుగా తల మీద పడడంతో తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.

ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో హైదరాబాద్ మెట్రో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పుడు డోర్ క్యాబిన్ ఊడిపడడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.

ఇదిలాఉండగా.. గత 14 రోజులుగా  టీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్‌ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నిల్చునే డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు